[1] నేను గొంతెత్తి యెహోవాకు మొర పెట్టుకుంటున్నాను. కంఠమెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.
[2] ఆయన సన్నిధానంలో నేను నా ఆలోచనలు వెల్లడి చేసుకుంటున్నాను. నేను పడ్డ బాధ ఆయన సమక్షంలో వివరంగా చెప్పుకుంటున్నాను.
[3] నా ప్రాణం నాలో ఎంతో కుంగిపోయినప్పుడు నా నడత నీకు తెలుసు. నన్ను చేజిక్కించుకోవడానికి నేను నడిచే త్రోవలో వాళ్ళు రహస్యంగా వలలు పన్నారు.
[4] నా కుడిప్రక్క కళ్ళారా చూడు. నా అనేవాడు ఒక్కడూ నాకు లేకపోయాడు. ఆశ్రయ స్థానమంటూ నాకు లేకపోయింది. నన్ను దయ చూచేవాడొక్కడూ లేడు.
[5] యెహోవా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను. నేను అన్నాను గదా, నా ఆశ్రయం నీవే, సజీవుల భూమి మీద నీవే నాకు కలిగిన వాటా.
[6] నేను చాలా అణగారిపోయి ఉన్నాను. నా మొర చెవిని బెట్టు. నన్ను తరిమేవాళ్ళు నాకంటే బలమైన వాళ్ళు. వాళ్ళ బారినుంచి నన్ను తప్పించు.
[7] నీ పేరుకు నేను కృతజ్ఞతలు అర్పిస్తాను. చెరలో నుంచి నా ప్రాణాన్ని విడిపించు. నీవు నాకు గొప్ప ఉపకారం చేస్తావు. న్యాయవంతులు అది చూచి నా చుట్టూరా సమకూడుతారు.