Skip to content
Opens in a new window

[1] దిక్కులేనివారికి సహాయం చేసే వ్యక్తి ధన్యజీవి. కీడు కాలంలో యెహోవా ఆ వ్యక్తిని విడుదల చేస్తాడు.

[2] యెహోవా అతణ్ణి కాపాడుతాడు, అతడి ప్రాణం దక్కిస్తాడు. భూమిమీద అతడికి ఎంతో క్షేమం. నీవు అతణ్ణి శత్రువుల పేరాశకు వదలివెయ్యవు.

[3] మంచం పట్టినప్పుడు అతణ్ణి యెహోవా ఆదరిస్తాడు. రోగంతో పడుకొన్న అతడి పడక నీవు మార్చివేస్తావు.

[4] నేనిలా అన్నాను: “యెహోవా, నన్ను దయ చూడు! నా అంతరంగానికి ఆరోగ్యం ప్రసాదించు! నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను.

[5] నా శత్రువులు నా గురించి చెడుగా చెప్పుకొంటున్నారు. “వీడెప్పుడు చస్తాడో, వీడి నామరూపాలు ఎప్పుడు లేకుండా పోతాయో!” అంటారు.

[6] నన్ను చూడడానికి ఎవడైనా వస్తే అబద్ధమాడుతాడు. నిరాధారమైన సంగతులు లోలోపల పోగు చేసుకొంటాడు. బయటికి వెళ్ళి బహిరంగంగా వాటిని వాగుతాడు.

[7] నన్ను ద్వేషించేవాళ్ళంతా కలిసి నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతారు. నాకు కీడు చేయాలని దురాలోచన చేస్తారు.

[8] “అతడికి వినాశకరమైనది ముంచుకు వచ్చింది. అతడు పడుకొన్న పడకనుంచి మళ్ళీ లేవలేడు” అంటారు వాళ్ళు.

[9] నా స్నేహితుడు కూడా, నేను నమ్మిన మనిషి, నా రొట్టె నాతో తిన్నవాడు నన్ను తన్నడానికి మడిమ ఎత్తాడు.

[10] యెహోవా! నన్ను దయ చూడు! నన్ను లేవనెత్తు. అప్పుడు నేను వాళ్ళకు ప్రతీకారం చేస్తాను.

[11] నా శత్రువు నా మీద జయధ్వనులు చేయలేడు. నేనంటే నీకు అనురాగమని దీనివల్ల నాకు తెలుసు.

[12] నేను నిజాయితీగలవాణ్ణి గనుక పడిపోకుండా నన్ను నిలుపుతావు నీవు. నీ సముఖంలో ఎప్పటికీ నన్ను నిలబెట్టుకొంటావు.

[13] ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా యుగాలనుంచి యుగాలవరకు శాశ్వతంగా స్తుతిపాత్రుడు! తథాస్తు! తథాస్తు!

కీర్తనలు — Chapters