[1] యెహోవాను స్తుతించండి! యెహోవా పేరును స్తుతించండి! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
[2] యెహోవా ఆలయంలో, మన దేవుని ఆలయ ఆవరణాలలో నిలుచుండే మీరు యెహోవాను స్తుతించండి!
[3] యెహోవా మంచివాడు. యెహోవాను స్తుతించండి! ఆయన పేరును గురించి స్తుతిగీతాలు చెయ్యండి! అది మనోహరం.
[4] యెహోవా తన కోసం యాకోబు వంశాన్ని ఎన్నుకొన్నాడు. తన సొత్తుగా ఇస్రాయేల్‌ప్రజను కోరుకొన్నాడు.
[5] యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన ప్రభువు దేవుళ్ళనబడ్డ వాళ్ళందరికంటే మించినవాడు.
[6] తనకు ఏది ఇష్టమో అదంతా జరిగిస్తాడాయన. భూమిమీద, ఆకాశాలలో, సముద్రాల్లో, అన్ని జలాగాధాలలో తన ఇష్టప్రకారం జరిగిస్తాడు.
[7] భూమి కొనలనుంచి ఆవిరి లేచేలా చేస్తాడు. మెరుపులు పుట్టించి వాన కురిపిస్తాడు. తన ఖజానాల నుంచి గాలులను పంపుతాడు.
[8] ఈజిప్ట్‌వాళ్ళ పెద్ద కొడుకులనూ పశువుల తొలుచూలులనూ ఆయన హతం చేశాడు.
[9] ఈజిప్ట్‌దేశమా! నీ మధ్య, నీ చక్రవర్తి ఎదుట, అతడి పరివారం ఎదుట, ఆయన సూచకమైన క్రియలూ అద్భుతాలూ జరిగించాడు.
[10] అనేక జనాలను హతం చేశాడు. బలవంతులైన రాజులను కూల్చాడు.
[11] అమోరీవాళ్ళ రాజు సీహోనును, బాషాను రాజైన ఓగును ఆయన హతమార్చాడు. కనాను రాజ్యాలన్నిటినీ పాడు చేశాడు.
[12] ఆయన వాళ్ళ ప్రాంతాలను వారసత్వంగా తన ఇస్రాయేల్‌ప్రజకు వారసత్వంగా ఇచ్చాడు.
[13] యెహోవా, నీ పేరు శాశ్వతంగా నిలుస్తుంది. యెహోవా, నిన్ను గురించిన జ్ఞాపకం తరతరాలకూ ఉంటుంది.
[14] యెహోవా తన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు. తన సేవకుల విషయం పశ్చాత్తాపపడడు.
[15] ఇతర ప్రజల దేవుళ్ళ విగ్రహాలు వెండి బంగారాలవి. అవి మనుషులు చేతులతో చేసినవి.
[16] వాటికి నోరుంటుంది గాని మాట్లాడలేవు. వాటికి కండ్లుంటాయి గాని చూడలేవు.
[17] వాటికి చెవులుంటాయి గాని వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.
[18] విగ్రహాలను తయారు చేసేవాళ్ళు, వాటిమీద నమ్మకం పెట్టేవాళ్ళంతా వాటిలాగే అవుతారు.
[19] ఇస్రాయేల్‌వంశికులారా! యెహోవాను కీర్తించండి! అహరోను వంశికులారా! యెహోవాను కీర్తించండి!
[20] లేవీ వంశంవారలారా! యెహోవాను కీర్తించండి! యెహోవా అంటే భయభక్తులున్న వారలారా! యెహోవాను కీర్తించండి!
[21] జెరుసలంలో నివసించే యెహోవా సీయోనులో కీర్తి అందుకొంటాడు గాక! యెహోవాను కీర్తించండి!