Skip to content
Opens in a new window

[1] నా ప్రజలారా, నా ఉపదేశం చెవిని పెట్టండి. నా నోటినుంచి వెలువడే మాటలు చెవియొగ్గి వినండి.

[2] నోరార నేను కావ్యం చెపుతాను. పురాతన కాలంనుంచి వచ్చిన గూఢ సత్యాలు వినిపిస్తాను.

[3] ఈ సంగతులు మేము విన్నాం, తెలుసుకొన్నాం. మా పూర్వీకులు మాకు తెలియజేశారు.

[4] ఈ విషయాలు వారి పిల్లలకు చెప్పకుండా దాచము. రాబోయే తరానికి యెహోవా సంస్తుతులను ఆయన బలప్రభావాలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను చెపుతాను.

[5] ఆయన యాకోబువంశంలో ఓ సాక్ష్యం నిలిపాడు, ఇస్రాయేల్‌కు ఓ ఉపదేశం ప్రసాదించాడు. వీటిని మన పూర్వీకులు తమ పిల్లలకు అందించాలని ఆయన ఆజ్ఞాపించాడు.

[6] ఆయన ఉద్దేశమేమిటంటే, మరుసటి తరంలో పుట్టబోయే పిల్లలు ఇదంతా తెలుసుకొని, తిరిగి తమ పిల్లలకు ఇదంతా చెప్పుకోవడానికి పూనుకోవాలి;

[7] వీళ్ళంతా దేవునిమీద నమ్మకం ఉంచాలి; దేవుని క్రియలను మరువకుండా ఆయన ఆజ్ఞలు పాటించాలి;

[8] వీళ్ళు తమ పూర్వీకులలాంటివారు కాకూడదు అన్నమాట. ఆ తరంవాళ్ళు మొండికెత్తి, దేవునికి తిరుగుబాటు చేసినవాళ్ళు. తమ హృదయాలను సరి చేసుకొన్నవాళ్ళు కాదు. వాళ్ళు దేవుని విషయం అంతరంగంలో నమ్మకమైనవాళ్ళు కాదు.

[9] ఎఫ్రాయిం గోత్రంవాళ్ళు యుద్ధాయుధాలను ధరించి కూడా తీరా యుద్ధ సమయం వచ్చేటప్పటికి వెనక్కు తిరిగారు.

[10] వాళ్ళు దేవుని ఒడంబడిక ప్రకారం ప్రవర్తించలేదు. ఆయన ధర్మశాస్త్రం అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడలేదు.

[11] ఆయన క్రియలను, వారికి చూపిన ఆయన అద్భుతాలను వాళ్ళు మరిచిపోయారు.

[12] వాళ్ళ పూర్వీకులు చూస్తూ ఉండగానే ఈజిప్ట్‌ దేశంలో, సోయన్‌నగర ప్రదేశంలో ఆయన వింతలు చేశాడు.

[13] ఆయన సముద్రాన్ని రెండుగా విభజించాడు. అందులో గుండా వాళ్ళను దాటించాడు, నీళ్ళను సమకూర్చి, ఓ కుప్పలాగా నిలిపాడు.

[14] పగలు తన మేఘంతో, రాత్రి అంతా మంటల వెలుగుతో ఆయన వారికి వెళ్ళవలసిన దారి చూపాడు.

[15] ఎడారిలో ఆయన బండలను చీల్చాడు. జలాగాధంలాగా సమృద్ధిగా వారికి త్రాగడానికి నీళ్ళు అనుగ్రహించాడు.

[16] బండలో నుంచి నీటి ప్రవాహాలు వచ్చేలా చేశాడు. నదులలాగా నీళ్ళు పారేలా చేశాడు.

[17] అయినా వాళ్ళు ఆయనకు విరోధంగా పాపాలు చేస్తూనే వచ్చారు. సర్వాతీతుని మీద ఎడారిలో తిరుగుబాటు చేస్తూనే వచ్చారు.

[18] శరీర తృప్తికి ఆహారం కావాలని ఆయనను అడిగారు. ఈ విధంగా వీళ్ళు తమ హృదయంలో దేవుణ్ణి పరీక్షకు గురి చేశారు.

[19] దేవుణ్ణి ఎదిరించి ఇలా మాట్లాడుకొన్నారు: “ఎడారిలో దేవుడు మనకు భోజనం పెట్టగలడా?

[20] ఆయన బండను కొట్టగా దానిలో నుంచి నీళ్ళు పెల్లుబికి వచ్చాయి. నీరు ప్రవాహమై పారింది. అయితే ఆయన మనకు రొట్టెలు పెట్టగలడా? తన ప్రజలకు మాంసం సరఫరా చెయ్యగలడా?”

[21] ఇదంతా విని, యెహోవా కోపగించుకొన్నాడు. యాకోబువంశానికి నిప్పంటుకొంది. ఇస్రాయేల్‌ప్రజల మీద దేవుని కోపం రగులుకొంది.

[22] ఎందుకంటే, వాళ్ళు దేవునిమీద నమ్మకం ఉంచినవారు కారు. ఆయన రక్షణ ప్రసాదిస్తాడని నమ్ముకొన్నవారు కారు.

[23] అయినా, పైన ఉన్న మేఘాలకు ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఆకాశ ద్వారాలను ఆయన తెరిచాడు.

[24] తినడానికి వాళ్ళ మీద మన్నా కురిపించాడు. ఆకాశంనుంచి ఆహారం వాళ్ళకు దయ చేశాడు.

[25] దేవదూతల ఆహారం మనుషులు తిన్నారు. ఆహారాన్ని వాళ్ళకు సర్వ సమృద్ధిగా దేవుడు పంపాడు.

[26] ఆకాశంలో తూర్పుగాలి వీచేలా చేశాడు. తన బలంచేత దక్షిణం గాలి రప్పించాడు.

[27] ధూళి అంత విస్తారంగా మాంసం కురిపించాడాయన. సముద్రం ఇసుకరేణువులా అన్నట్టు రెక్కలున్న పక్షులను వాళ్ళపై కుమ్మరించాడు.

[28] ఈ పక్షులు వారి శిబిరంలో, వారి డేరాలచుట్టు దిగి వచ్చేలా చేశాడు.

[29] వాళ్ళంతా కడుపునిండా తిన్నారు. వాళ్ళు ఆశించినదానిని ఇచ్చాడాయన.

[30] అయినా, వారి ఆశ తీరేముందే, ఆహారం ఇంకా వాళ్ళ నోట ఉండగానే,

[31] దేవుని కోపం వాళ్ళమీదికి వచ్చింది. వారిలో బలిసినవాళ్ళను కొందరిని ఆయన హతమార్చాడు. ఇస్రాయేల్‌ప్రజలలో యువకులను అణచివేశాడు.

[32] ఇంత జరిగినా, వాళ్ళింకా పాపాలు చేస్తూనే వచ్చారు. ఆయన చేసిన అద్భుతాలు చూచినా వాళ్ళు ఆయనను నమ్మకుండా ఉన్నారు.

[33] అందుచేత వాళ్ళ రోజులు వ్యర్థంగా గతించిపోయేలా చేశాడు. వాళ్ళ సంవత్సరాలు భయంతో ముగిసిపొయ్యేలా చేశాడు.

[34] దేవుడు వారిని చంపినప్పుడు ఆయనను వెదికారు. ఆయన వైపు తిరిగి, శ్రద్ధాసక్తులతో ఆయనను అన్వేషించారు.

[35] దేవుడు తమకు ఆధారశిలలాంటివాడని గుర్తు తెచ్చుకొన్నారు. సర్వాతీతుడు తమ్మును కొనుక్కొని విడిపించినవాడని జ్ఞాపకం చేసుకొన్నారు.

[36] అయినా వారి హృదయం ఆయనపట్ల నిలకడగా లేదు. ఆయన చేసిన ఒడంబడిక విషయం వాళ్ళు నమ్మకంగా లేరు.

[37] వాళ్ళు నోటితో ఆయనకు కపటమైన మాటలు చెప్పారు.

[38] అయినా, దేవుడు వాత్సల్యమయుడు. వారి అపరాధాన్ని కప్పివేశాడు. వాళ్ళను నాశనం చేయలేదు. చాలా సార్లు ఆయన కోపాగ్నిని అణచుకొన్నాడు. తన ఆగ్రహమంతా పురికొల్పుకోలేదు.

[39] వాళ్ళు శరీరులనీ, వెళ్ళి తిరిగి రాని గాలి ఊపిరిలాంటివాళ్ళనీ ఆయనకు జ్ఞాపకమే.

[40] ఎడారిలో వాళ్ళెన్నో సార్లు ఆయనమీద తిరుగబడ్డారు. ఆ పాడు ప్రదేశంలో ఆయనను ఎన్నో సార్లు దుఃఖపెట్టారు.

[41] చీటికీ మాటికీ వాళ్ళు దేవుణ్ణి పరీక్షించారు. ఇస్రాయేల్‌ప్రజలు పవిత్రుడైన దేవుణ్ణి హద్దులో పెట్టారు.

[42] ఆయన బలం ఎలాంటిదో వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. శత్రువుల బారినుంచి వాళ్ళను ఆయన విడిపించిన రోజైనా వాళ్ళకు జ్ఞాపకం లేకపోయింది.

[43] అప్పుడు ఈజిప్ట్‌లో ఆయన తన చిహ్నాలు కనుపరచాడు. సోయన్‌నగర ప్రాంతంలో అద్భుతాలు చేసి చూపాడు. ఇదీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు.

[44] నైలు నది కాలువలు, అక్కడి ప్రవాహాలు రక్తంగా మార్చాడు. ఈజిప్ట్‌వాళ్ళు వాటి నీళ్ళు తాగలేకపోయారు.

[45] ఆయన వాళ్ళ మీదికి ఈగల గుంపులను పంపాడు. అవి వాళ్ళును మింగివేశాయి. కప్పలను వదిలాడు. అవి వాళ్ళ మీదికి నాశనం రప్పించాయి.

[46] పంట చేలను పురుగులకు వదిలి పెట్టాడు. వాళ్ళ కృషి ఫలితాన్ని మిడతలకు అప్పగించాడు.

[47] వడగండ్లు కురిపించి ద్రాక్షచెట్లను పాడు చేశాడు. చలిమంచుచేత వాళ్ళ మేడిచెట్లను నాశనం చేశాడు.

[48] వాళ్ళ గొడ్లూ గోదా వడగండ్ల పాలయ్యేలా, వాళ్ళ మందలు పిడుగుల పాలయ్యేలా చేశాడు.

[49] వాళ్ళ మీదికి ఆయన తన కోపాగ్ని, ఆగ్రహం, చిరాకు, బాధ పంపాడు. విపత్తు కలిగించే దేవదూతల గుంపును పంపాడు.

[50] తన కోపానికి దారి సరిచేశాడు. మరణంనుంచి వాళ్ళ ప్రాణాన్ని తప్పించలేదు. వాళ్ళను నాశనానికి అప్పగించాడు.

[51] ఈజిప్ట్‌లో జ్యేష్ఠ కుమారులందరినీ, ఆ హాము వంశంవాళ్ళ నివాసాల్లో వాళ్ళ బలంవల్ల కలిగిన ఆ తొలి సంతానాన్ని ఆయన హతం చేశాడు.

[52] అప్పుడు గొర్రెలను నడిపించినట్టు తన ప్రజలను ఆయన వెంటబెట్టుకుపోయాడు. ఎడారిలో మందలాగా వాళ్ళకు దారి చూపుతూ వెళ్ళాడు.

[53] వారు భయపడకుండా క్షేమంగా వారిని నడిపించాడు. కాని, వారి శత్రువులను సముద్రం ముంచివేసింది.

[54] పవిత్రమైన తన దేశానికి తన కుడి చేయి సంపాదించిన ఈ కొండసీమకు వారిని తీసుకువచ్చాడు.

[55] వారి ఎదుటనుంచి ఇక్కడి జనాలను ఆయన పారదోలాడు. ఆ జనాల భూములను వారికి వారసత్వంగా పంచియిచ్చాడు. వాళ్ళ నివాస స్థలాలలో ఇస్రాయేల్‌గోత్రాలను కాపురముండేలా చేశాడు.

[56] అయినా, సర్వాతీతుణ్ణి వారు పరీక్షించారు, ఎదిరించారు. ఆయన శాసనాలను వారు పాటించలేదు.

[57] తమ పూర్వీకులలాగే దేవునినుంచి వెనక్కు తీసి ద్రోహులయ్యారు. ఎక్కు పెడితే సరిగ్గా వంగని విల్లులాగా వాళ్ళు తొలగిపొయ్యారు.

[58] తమ ఎత్తయిన పూజాస్థలాలచేత ఆయనకు కోపం రేపారు. తమ విగ్రహాల మూలంగా ఆయనకు రోషం పురికొలిపారు.

[59] దేవుడు ఇదంతా చూచి కోపపడ్డాడు. ఇస్రాయేల్‌ప్రజలంటే, ఆయనకు ఎంతో అసహ్యం కలిగింది.

[60] అప్పుడాయన షిలోహులో ఉన్న తన నివాసాన్ని విసర్జించాడు. మనుషులమధ్య ఆయన వేసిన ఆ గుడారాన్ని వదిలిపెట్టాడు.

[61] తన బలాన్ని బందీగా అప్పగించివేశాడు. తన మహిమను శత్రువుల చేతికి ఇచ్చాడు.

[62] తన ప్రజలను ఖడ్గానికి గురి చేశాడు. తన సొత్తయిన ప్రజ మీద ఆయన తన ఆగ్రహం కుమ్మరించాడు.

[63] మంటలు వాళ్ళ యువకులను మింగివేశాయి. వాళ్ళ కన్యలకు పెళ్ళిపాటలు లేకపోయాయి.

[64] వాళ్ళ యాజులు కత్తిపాలై కూలారు. వాళ్ళ విధవరాండ్రు ఏడవలేకపోయారు.

[65] అప్పుడు నిద్రలోనుంచి మేల్కొన్నట్టు ప్రభువు లేచాడు. మద్యం చేత మత్తిల్లి విజయ ధ్వనులు చేసే వీరుడులాంటివాడయ్యాడు.

[66] ఆయన శత్రువులను వెనక్కు తరిమికొట్టాడు. వాళ్ళ మీదికి శాశ్వతమైన నింద రప్పించాడు.

[67] ఆయన యోసేపు డేరాను చీదరించుకొన్నాడు. ఎఫ్రాయిం గోత్రాన్ని ఆయన ఎన్ను కోలేదు.

[68] ఆయన యూదగోత్రాన్ని ఎన్నుకొన్నాడు. తనకు ప్రియమైన సీయోను కొండను ఆయన ఎన్నుకొన్నాడు.

[69] తన ఎత్తయిన నివాసం కట్టినట్టు తన పవిత్రాలయం నిర్మించాడు. భూమిని శాశ్వతంగా స్థాపించినట్టే దానిని కట్టించాడు.

[70] తన సేవకుడైన దావీదును ఎన్నుకొన్నాడు. అతణ్ణి గొర్రెల దొడ్లలోనుంచి తీసుకొన్నాడు.

[71] అతడి కాపుదలలో ఉన్న పాలిచ్చేగొర్రెల దగ్గరనుంచి రప్పించి, తన ప్రజలైన యాకోబు జనానికి కాపరిగా ఉండడానికి, తన సొత్తుగా ఉన్న ఆ ఇస్రాయేల్‌ప్రజలకు కాపరిగా ఉండడానికి అతణ్ణి నియమించాడు.

[72] అతడు వారికి నిజాయితీపరుడైన కాపరిగా ఉన్నాడు. ప్రవీణుడై వారికి మార్గదర్శిగా ఉన్నాడు.

కీర్తనలు — Chapters