Skip to content
Opens in a new window

[1] యెహోవా, నన్ను కోపంతో మందలించకు. ఆగ్రహంతో నన్ను శిక్షకు గురి చెయ్యకు.

[2] నీ బాణాలు నాకు బాగా గుచ్చుకున్నాయి. నీ చేయి నా మీదికి వచ్చి ఉంది.

[3] నీ కోపం నా శరీరారోగ్యాన్ని హరించివేసింది. నా దోషం వల్ల నా ఎముకల్లో క్షేమం లేకుండా పోయింది.

[4] నా అపరాధాలు నా తలను మించిపొయ్యాయి. అవి నాకు మించిన బరువనిపిస్తుంది.

[5] నేను మూర్ఖంగా ప్రవర్తించాను. అందుకే నా గాయాలలోనుంచి దుర్వాసనతో చీము కారుతుంది.

[6] నేను మెలిదిరిగిపొయ్యాను, బాగా వంగిపొయ్యాను. రోజంతా దుఃఖంతో తిరుగులాడుతున్నాను.

[7] నా నడుములో మంట నిండి ఉంది. నా శరీరారోగ్యం క్షీణించింది.

[8] నా ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయింది, నలిగిపోయింది. హృదయ బాధవల్ల నేను మూలుగుతున్నాను.

[9] ప్రభూ! నేను కోరేదంతా నీకు బాగా తెలుసు. నా నిట్టూర్పులు నీకేమీ మరుగు కాదు.

[10] నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. నాలో ఉన్న బలం హరించుకుపోయింది. నాకు కళ్ళలో కాంతి లేకుండా పోయింది.

[11] నా ప్రేమికులూ మిత్రులూ నా ఆపద చూచి దూరమయ్యారు. నా బంధువులు కూడా దూరంగానే నిలుచున్నారు.

[12] నా ప్రాణం తీయాలని చూచేవాళ్ళు వలలు పన్నుతున్నారు. నాకు కీడు చేయాలని చూచేవాళ్ళు శాపనార్థాలు పలుకుతున్నారు. రోజంతా అదే పనిగా కుట్రలు చేస్తున్నారు.

[13] నేనేమీ వినలేను. చెవిటివాడిలాగా అయ్యాను. మాట్లాడలేని మూగవాడిలా అయ్యాను.

[14] విననివాడిలాగా, ఎదురు పలకలేనివాడిలాగా ఉన్నాను.

[15] యెహోవా! నీ కోసమే ఎదురు చూస్తూవున్నాను. ప్రభూ! నా దేవా! నీవు జవాబిస్తావు.

[16] నేనిలా అనుకున్నాను: “నా కాలు జారి, నేను పడబోతుంటే వాళ్ళు నన్ను చూచి రెచ్చిపోకూడదు, సంతోషించకూడదు.”

[17] నేను తొట్రుపడనై ఉన్నాను. నా బాధ ఎప్పుడూ నాతో ఉంది.

[18] నా అపరాధం నేను ఒప్పుకొంటున్నాను. నా దోషం వల్ల కంగారుపడుతున్నాను.

[19] నా శత్రువులు బలిష్ఠులు. తీవ్రంగా ఉన్నారు. నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు అనేకులు.

[20] మంచికి చెడు చేయడమే వాళ్ళ పని. మంచినే చెయ్యాలని చూస్తున్నాను నేను. గనుక వాళ్ళు నన్ను ఎదిరిస్తున్నారు.

[21] యెహోవా! నన్ను వదలివేయకు! నా దేవా! నాకు దూరమైపోకు!

[22] నా రక్షణ నీవే, స్వామీ! త్వరగా నా సహాయానికి రా!

కీర్తనలు — Chapters