Skip to content
Opens in a new window

[1] బబులోను నదుల ప్రాంతంలో ఉండి మనం సీయోనును జ్ఞప్తికి తెచ్చుకొని ఏడ్చాం.

[2] అక్కడున్న నిరవంజి చెట్లకు మన తంతివాద్యాలు వ్రేలాడవేశాం.

[3] మనల్ని చెరపట్టినవాళ్ళు మనల్ని పాట పాడాలన్నారు. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు “సీయోను పాట ఒకటి పాడి వినిపించండి. మమ్మల్ని ఉల్లసింపజేయండి” అని అడిగారు.

[4] మనం ఇతర దేశంలో ఉండి యెహోవా పాటలు ఎలా పాడడం?

[5] జెరుసలమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచెయ్యి తన నేర్పు మరచిపోతుంది గాక!

[6] నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నా ఆనంద కారణాలలో ముఖ్యమైనదానికంటే ఎక్కువగా నేను నిన్ను కోరుకోకపోతే, నా నాలుక అంగిటికి అంటుకుపోతుంది గాక!

[7] యెహోవా, ఎదోం ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకముంచుకో. జెరుసలం పాడైపోయిన రోజు జ్ఞప్తి ఉంచుకో. వాళ్ళు “దానిని నాశనం చెయ్యండి. సమూల ధ్వంసం చెయ్యండి” అంటూ చాటించారు.

[8] నాశనం కాబోతున్న బబులోను కుమారీ! నీవు మాకు చేసినదానిని బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.

[9] నీ పసి పిల్లలను తీసుకొని, బండకేసి కొట్టి ముక్కచెక్కలు చేయబోయేవాడు ధన్యుడు.

కీర్తనలు — Chapters