[1] న్యాయవంతులారా! యెహోవాకు ఆనంద ధ్వనులు చేయండి. దైవసంస్తుతి చెయ్యడం నిజాయితీపరులకు తగిన పని.
[2] యెహోవాకు తంతివాయిద్యం వాయిస్తూ కృతజ్ఞత అర్పించండి. పది తంతుల వాయిద్యంతో ఆయనకు స్తుతి పాటలు పాడండి.
[3] ఆయనకు కొత్త కీర్తన ఆలపించండి, నేర్పుతో వాయిస్తూ సంతోష నాదాలు చెయ్యండి.
[4] ఎందుకంటే, యెహోవా వాక్కు యథార్థం. ఆయన కార్యకలాపాలన్నిటిలోనూ నమ్మకంగా ఉన్నాడు.
[5] నీతి న్యాయాలంటే ఆయనకెంతో ఇష్టం. యెహోవా అనుగ్రహంతో లోకమంతా నిండి ఉంది.
[6] యెహోవా వాక్కు మూలంగా ఆకాశాలు కలిగాయి. ఆయన నోటి శ్వాసచేత వాటి సమూహమంతా కలిగింది.
[7] ఆయనే సముద్రాన్ని జలరాశిగా రూపొందించేవాడు, అగాధ జలాలను నిధిగా సమకూర్చేవాడు.
[8] యెహోవాకు లోకమంతా భయపడాలి. యెహోవా అంటే భూనివాసులంతా భయంతో నిలవాలి.
[9] ఎందుకంటే ఆయన మాట్లాడాడు, అలాగే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు, అలానే స్థిరంగా ఏర్పడింది.
[10] జనాల సమాలోచనలను యెహోవా వమ్ము చేస్తాడు. ప్రజల ఉపాయాలను భంగం చేస్తాడు.
[11] యెహోవా ఆలోచనలు శాశ్వతంగా నిలుస్తాయి. ఆయన హృదయ భావాలు తరతరాలకూ స్థిరంగా ఉంటాయి.
[12] యెహోవా ఏ ప్రజకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజ ధన్యజీవులు. తన సొత్తుగా ఆయన ఎన్నుకొన్న ప్రజ ధన్య జీవులు.
[13] పరలోకంలో నుంచి యెహోవా వీక్షిస్తున్నాడు. మనుషులందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు.
[14] భూమి మీద ఉన్నవాళ్ళందరినీ తన నివాసం నుంచి ఆయన చూస్తూవున్నాడు.
[15] ఆయన వాళ్ళ హృదయాలన్నిటినీ రూపొందించేవాడు. వాళ్ళ కార్యకలాపాలన్నీ బాగా తెలిసినవాడు.
[16] రాజుకు తన గొప్ప సేన రక్షణ కాబోదు. వీరుడికి తన అధిక శక్తి విడుదల కాబోదు.
[17] విజయానికి గుర్రం వ్యర్థం. దాని గొప్ప బలంవల్ల మనిషికి విడుదల చేకూరదు.
[18] కాని, తన పట్ల భయభక్తులున్న వారిపై, తన అనుగ్రహం కోసం నమ్మకంతో ఎదురు చూచేవారి పై యెహోవా కన్ను వేసి ఉంచుతాడు.
[19] వారి ప్రాణాన్ని మరణంనుంచి తప్పిస్తాడాయన. కరవు కాటకాలలో వారు చావకుండా చేస్తాడు.
[20] మనం యెహోవాకోసం చూస్తూ ఉన్నాం. ఆయనే మనకు సహాయం. ఆయనే మనకు డాలులాంటివాడు.
[21] ఆయన పవిత్రమైన పేరుమీద మనకు నమ్మకం ఉంది. గనుక ఆయనలో మనకు హృదయానందం ఉంది.
[22] యెహోవా! మేము నీకోసం ఆశాభావంతో ఎదురుచూస్తున్న విధంగానే నీ అనుగ్రహం మా మీద ఉండనియ్యి.