Skip to content
Opens in a new window

[1] యెహోవా నా మొర, నా విన్నపం ఆలకించాడు. అందుచేత నేనాయనను ప్రేమిస్తున్నాను.

[2] ఆయన నా ఆక్రందన చెవిని పెట్టాడు. కాబట్టి నేను బ్రతికినన్నాళ్ళు ఆయనకు ప్రార్థన చేస్తాను.

[3] మరణ బంధకాలు నన్ను చుట్టివేశాయి. మృత్యులోక వేదనలు నన్ను పట్టుకొన్నాయి. బాధ, శోకం నేను అనుభవించాను.

[4] అప్పుడు యెహోవా పేర నేను ప్రాధేయపడ్డాను. “ఓ యెహోవా! నన్ను రక్షించు” అన్నాను.

[5] యెహోవా దయగలవాడు, న్యాయశీలి. మన దేవుడు కరుణామయుడు.

[6] యెహోవా అమాయకులను కాపాడుతాడు. నేను దుర్దశకు దిగజారిపోయి ఉండగా ఆయన నన్ను రక్షించాడు.

[7] నా ప్రాణమా, యెహోవా నీకు మేలు చేశాడు గనుక నీ విశ్రాంతిలో ప్రవేశించు.

[8] దేవా, నీవు నా ప్రాణాన్ని మరణంనుంచి తప్పించావు. నా కండ్లను కన్నీటినుంచి విడిపించావు. నా పాదాలను జారిపడకుండా కాపాడావు.

[9] సజీవుల దేశంలో నేను యెహోవా ఎదుట నడుస్తాను.

[10] నేను నమ్ముకొన్నాను గనుక మాట్లాడుతాను. నాకు ఎంతో బాధ కలిగింది.

[11] కంగారుపడిపోయి నేను అనుకొన్నాను, “మనుషులంతా అబద్ధికులు.”

[12] యెహోవా నాకు చేకూర్చిన ప్రయోజనాలకు నేను ఆయనకు ఏం ఇవ్వగలను?

[13] రక్షణ పాత్ర చేతపట్టుకుంటాను, యెహోవా పేర ప్రార్థన చేస్తాను.

[14] యెహోవాకు నా మొక్కుబళ్ళను అర్పించుకొంటాను. ఆయన ప్రజలందరి సమక్షంలో అర్పించుకొంటాను.

[15] తన భక్తులు చనిపోయారంటే అది యెహోవా దృష్టిలో విలువైన సంగతి.

[16] ఓ యెహోవా! నేను నీ దాసుణ్ణి గదా. నీ దాసుణ్ణి, నీ చరణదాసి కొడుకును. నీవు నా బంధకాలు విప్పావు.

[17] నేను కృతజ్ఞతార్పణ నీకు అర్పిస్తాను. యెహోవా పేర ప్రార్థన చేస్తాను.

[18] యెహోవాకు నా మొక్కుబళ్ళు అర్పించుకుంటాను. ఆయన ప్రజలందరి సమక్షంలో అర్పించుకుంటాను.

[19] జెరుసలెమా! నీ మధ్య, యెహోవా ఆలయ ఆవరణంలో వాటిని అర్పించుకుంటాను. యెహోవాను స్తుతించండి!

కీర్తనలు — Chapters