Skip to content
Opens in a new window

[1] యెహోవాను స్తుతించండి. ఆయన మంచివాడు. ఆయనకు కృతజ్ఞత చెప్పండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.

[2] యెహోవా బల ప్రభావాలను వర్ణించడం ఎవరి తరం? ఆయన కీర్తినంతా ఎవరు వినిపించగలరు?

[3] ధర్మ సమ్మతంగా నడుచుకొనేవారు ధన్యులు. ఎల్లవేళలా న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యజీవులు.

[4] యెహోవా, నీ ప్రజలమీద నీకున్న దయప్రకారం నన్ను తలచుకో. నీ రక్షణతో నన్ను సందర్శించు.

[5] అలాగైతే నీవు ఎన్నుకొన్నవారి క్షేమం నన్ను చూడనియ్యి. నీ ప్రజల ఆనందంలో నన్ను పాల్గొననియ్యి. నీ సొత్తుగా ఉన్న ప్రజతో పాటు నన్ను సన్నుతి చేయనియ్యి.

[6] మా పూర్వీకులలాగే మేమూ తప్పిదాలు చేశాం. అపరాధులమయ్యాం. దుర్మార్గాలు చేశాం.

[7] మా పూర్వీకులకు ఈజిప్ట్‌లో నీ అద్భుతాలు అర్థం కాలేదు. నీ అనుగ్రహ సమృద్ధిని వాళ్ళు తలచుకోలేదు. సముద్రం దగ్గర – ఆ ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.

[8] అయినా తన బలప్రభావాలను ప్రదర్శించేందుకు తన పేరుకోసం ఆయన వారిని రక్షించాడు.

[9] ఆయన ఎర్ర సముద్రాన్ని మందలించాడు. అది ఎండిపోయింది. ఎడారిలో నడిచినట్టు వారిని ఆ జలాగాధం గుండా నడిచేలా చేశాడు.

[10] పగ బూనినవాళ్ళ బారినుంచి వారిని తప్పించాడు. శత్రువుల బారినుంచి వారికి విడుదల ప్రసాదించాడు.

[11] నీళ్ళు వారి విరోధులను ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడూ మిగలలేదు.

[12] అప్పుడు ఇస్రాయేల్‌వారు ఆయన చెప్పినది నమ్మారు. ఆయనను స్తుతిస్తూ పాటలు పాడారు.

[13] అయినా ఆయన చేసిన క్రియలు వారు త్వరలో మరచిపోయారు. ఆయన ఇచ్చే సలహా కోసం వారు చూడలేదు.

[14] వారు ఎడారిలో పేరాశకు లోనయ్యారు. ఆ పాడు ప్రదేశంలో దేవుణ్ణి పరీక్షించారు.

[15] దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. అయినా, వారి ప్రాణాలు క్షీణించిపోయేలా చేశాడాయన.

[16] వారి శిబిరంలో మోషేమీద అసూయపడ్డారు. యెహోవా ప్రత్యేకించిన అహరోనుమీద కూడా వారికి అసూయ కలిగింది.

[17] అప్పుడు భూమి నోరు తెరచి, దాతానును మింగివేసింది. అబీరాం బృందంవాళ్ళను ఆవరించింది.

[18] వాళ్ళ జట్టుకు నిప్పంటుకొంది. ఆ దుర్మార్గులను కాల్చివేసింది ఆ మంట.

[19] హోరేబ్‌దగ్గర వాళ్ళు దూడ రూపాన్ని చేయించుకొన్నారు. పోతపోసిన ఆ విగ్రహాన్ని పూజించారు.

[20] తమ ఘనతకు బదులు గడ్డి మేసే ఎద్దు రూపాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.

[21] ఈజిప్ట్‌లో అద్భుతాలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయారు.

[22] ఆ హాము దేశంలో ఆశ్చర్యకరమైన క్రియలు చేసిన తమ దేవుణ్ణి, ఎర్ర సముద్రం దగ్గర భయభక్తులు కలిగించే క్రియలు చేసిన తమ దేవుణ్ణి మరచిపోయారు.

[23] కనుక ఆయన “వారిని నాశనం చేస్తాను అన్నాడు. కానీ ఆయన ఎన్నుకొన్న మోషే ఆయన ఎదుట బీటలో నిలిచి, ఆయన కోపం వారిని ధ్వంసం చేయకుండా చేశాడు. కాబట్టి సరిపోయింది.

[24] తరువాత వారు మనోహరమైన దేశాన్ని తిరస్కరించారు. వారు ఆయన మాట నమ్మారు కారు.

[25] యెహోవా మాట వినక, తమ డేరాలలో సణుగుకొన్నారు.

[26] అప్పుడాయన వారిని ఎడారిలో కూల్చివేస్తానని వారికి శపథం చేశాడు.

[27] ఇతర జనాలమధ్య వారి సంతానాన్ని కూలగొట్టివేస్తాననీ వేరు వేరు దేశాలలో వారిని చెదరగొట్టివేస్తాననీ ఒట్టు వేసుకొన్నాడు.

[28] తరువాత వారు పెయోర్‌లోని బయల్‌దేవుడితో చేరారు. చచ్చినవాళ్ళకు అర్పించిన బలులు తిన్నారు.

[29] తమ చర్యలచేత ఆయనకు కోపం రేపారు. అందుచేత వారిమధ్య విపత్తు ఆరంభమైంది.

[30] ఫీనెహాస్‌నిలబడి న్యాయ శిక్ష జరిగించాడు. కనుక ఆ విపత్తు ఆగిపోయింది.

[31] అన్ని తరాలకూ శాశ్వతంగా అది అతనికి నిర్దోషత్వంగా పరిగణించబడింది.

[32] మెరీబా నీళ్ళదగ్గర వారు దేవుని కోపం రేపారు. అందుచేత వారి మూలంగా మోషే బాధకు గురి అయ్యాడు.

[33] వారు దేవుని ఆత్మను ఎదిరించారు. కనుక అతని పెదవుల వెంట పొరపాటు మాట వచ్చింది.

[34] తరువాత యెహోవా నాశనం చెయ్యాలని చెప్పిన జనాలను వారు నాశనం చేయలేదు.

[35] ఇతర జనాలతో కలిసిపోయి వారి పనులు నేర్చుకొన్నారు.

[36] ఆ జనాల విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరిగా ఉన్నాయి.

[37] వారు తమ కొడుకులను, కూతుళ్ళను దయ్యాలకు బలి ఇచ్చారు.

[38] అమాయకుల రక్తం, తమ కొడుకుల, కూతుళ్ళ రక్తం ఒలికించారు. కనాను దేశస్థుల విగ్రహాలకు వారిని రక్త బలులుగా అర్పించారు. ఈ రక్తపాతం చేత దేశం అపవిత్రమయింది.

[39] వారు తమ క్రియలద్వారా అపవిత్రులయ్యారు. తమ చర్యలలో వేశ్యలాగా ప్రవర్తించారు.

[40] కనుక యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. తన సొత్తుగా ఉన్న జనంమీద ఆయనకే అసహ్యం వేసింది.

[41] ఇతర జనాల చేతికి వారిని అప్పగించాడు. వారి పగవాళ్ళు వారి మీద ప్రభుత్వం చేశారు.

[42] వారి శత్రువులు వారిని అణగద్రొక్కారు. ఆ శత్రువుల చేతిక్రింది వారు తలవొగ్గక తప్పలేదు.

[43] చాలాసార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనలనే అనుసరించి తిరగబడ్డారు. తమ అపరాధం చేత దురవస్థ చెందారు.

[44] అయినా వారి మొర ఆయన విన్నప్పుడు వారి కష్టదశ ఆయన చూశాడు.

[45] వారి నిమిత్తం ఆయన తన ఒడంబడికను తలచుకొన్నాడు. తన గొప్ప కృపను బట్టి వారిని కనికరించాడు.

[46] వారిని చెరపట్టిన వాళ్ళందరికీ వారి మీద జాలి పుట్టేలా చేశాడాయన.

[47] మా దేవా, యెహోవా, మమ్ముల్ని రక్షించు! మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞత అర్పించేలా, నిన్ను స్తుతించడంలో మాకు అతిశయం కలిగేలా ఇతర జనాల మధ్య నుంచి మమ్ముల్ని సమకూర్చు.

[48] ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగుతుంది గాక! ప్రజలంతా తథాస్తు అంటారు గాక! యెహోవాను స్తుతించండి!

కీర్తనలు — Chapters