[1] యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి.
[2] యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.
[3] రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.
[4] యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి.
[5] జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా.
[6] ఘనతాప్రభావాలు ఆయన ముందున్నాయి. బలం, సౌందర్యం ఆయన పవిత్ర ఆలయంలో ఉన్నాయి.
[7] ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ యెహోవాకు చెల్లించండి. మహిమ, బలం యెహోవాకు చెల్లించండి.
[8] యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి.
[9] పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి.
[10] యెహోవా పరిపాలిస్తున్నాడు. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన ప్రజలకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని రాజ్యాల్లో చెప్పండి.
[11] యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక.
[12] మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక. అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక
[13] లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.