[1] దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు.
[2] నీ శత్రువులు నీకు ఎదురు తిరుగుతున్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు.
[3] నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు.
[4] వాళ్ళిలా చెబుతున్నారు, వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేద్దాం రండి. అప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఇక గుర్తుకు రాకుండా ఉంటుంది.
[5] ఏకగ్రీవంగా వాళ్ళు ఆలోచన చేశారు. నీకు విరోధంగా ఒప్పందాలు చేసుకున్నారు.
[6] గుడారాల్లో జీవించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,
[7] గెబలు జాతి వాళ్ళు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు,
[8] అష్షూరు దేశస్థులు వాళ్ళ పక్షాన చేరారు. లోతు వంశస్థులకు వాళ్ళు సాయం చేస్తున్నారు. సెలా
[9] నువ్వు మిద్యానుకు ఏమి చేశావో కీషోను వాగు దగ్గర నువ్వు సీసెరాకు, యాబీనుకు ఏమి చేశావో అలాగే వారికి చెయ్యి.
[10] వాళ్ళు ఏన్దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు.
[11] ఓరేబు, జెయేబు నాయకులకు నువ్వు చేసినట్టు వారి ప్రధానులకు చెయ్యి. జెబహు సల్మున్నా అనే వారికి నువ్వు చేసినట్టు వాళ్ళ రాజులందరికీ చెయ్యి.
[12] దేవుని పచ్చిక భూములను మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళు అంటున్నారు.
[13] నా దేవా, సుడి తిరిగే దుమ్ములాగా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళను చెయ్యి.
[14] మంటలు అడవిని కాల్చివేసినట్టు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్టు,
[15] నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు.
[16] యెహోవా, వాళ్ళు నీ నామాన్ని వెతికేలా వాళ్ల ముఖాలకు అవమానం కలిగించు.
[17] వాళ్ళు ఎప్పుడూ అవమానం, భయం అనుభవించాలి, వాళ్ళు సిగ్గుపాలై నాశనం కావాలి.
[18] యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.