[1] ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.
[2] ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.
[3] వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.
[4] మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.
[5] ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది!
[6] నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.
[7] నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
[8] నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. బేత్
[9] యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?
[10] నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.
[11] నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.
[12] యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.
[13] నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.
[14] సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.
[15] నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.
[16] నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. గీమెల్
[17] నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను.
[18] నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.
[19] నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.
[20] అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.
[21] గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.
[22] నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు.
[23] పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.
[24] నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. దాలెత్
[25] నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.
[26] నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు.
[27] నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను.
[28] విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.
[29] మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.
[30] విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.
[31] యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు.
[32] నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. హే
[33] యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.
[34] నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
[35] నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.
[36] నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.
[37] పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.
[38] నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు.
[39] నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి.
[40] నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు. వావ్
[41] యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు.
[42] అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను.
[43] నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను.
[44] ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.
[45] నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.
[46] సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను.
[47] నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.
[48] నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను. జాయిన్.
[49] నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు.
[50] నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.
[51] గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు.
[52] యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను.
[53] నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.
[54] యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు.
[55] యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను.
[56] నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. హేత్
[57] యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.
[58] కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.
[59] నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.
[60] నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.
[61] భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.
[62] న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.
[63] నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. తేత్
[64] యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.
[65] యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.
[66] నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.
[67] బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.
[68] నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.
[69] గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
[70] వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.
[71] బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
[72] వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. యోద్
[73] నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.
[74] నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.
[75] యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.
[76] నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.
[77] నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.
[78] నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.
[79] నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.
[80] నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక. కఫ్
[81] నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.
[82] నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.
[83] నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
[84] నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?
[85] నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
[86] నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.
[87] భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.
[88] నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు. లామెద్.
[89] యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
[90] నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
[91] అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.
[92] నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.
[93] నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.
[94] నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.
[95] నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.
[96] సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు. మేమ్
[97] నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.
[98] నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.
[99] నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
[100] నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.
[101] నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.
[102] నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.
[103] నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.
[104] నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి. నూన్
[105] నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
[106] నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
[107] యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.
[108] యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు
[109] నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.
[110] నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.
[111] నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.
[112] నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం. సామెహ్
[113] రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
[114] నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.
[115] నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.
[116] నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.
[117] నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.
[118] నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.
[119] భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.
[120] నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. అయిన్
[121] నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.
[122] మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.
[123] నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.
[124] నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
[125] నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి
[126] ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.
[127] బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.
[128] నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం. పే
[129] నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.
[130] నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.
[131] నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.
[132] నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.
[133] నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.
[134] నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.
[135] నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
[136] ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను. సాదె
[137] యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.
[138] నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.
[139] నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.
[140] నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.
[141] నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.
[142] నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.
[143] బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
[144] నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి. ఖొఫ్
[145] యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.
[146] నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.
[147] తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను
[148] నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.
[149] నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.
[150] దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.
[151] యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.
[152] నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. రేష్
[153] నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.
[154] నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.
[155] భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.
[156] యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.
[157] నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.
[158] ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
[159] యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.
[160] నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి. షీన్
[161] అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.
[162] పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.
[163] అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
[164] నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
[165] నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు
[166] యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.
[167] నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.
[168] నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను. తౌ
[169] యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.
[170] నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు.
[171] నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.
[172] నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.
[173] నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక.
[174] యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.
[175] నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక
[176] తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.