[1] యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!
[2] శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.
[3] నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,
[4] నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
[5] అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.
[6] నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు.
[7] గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,
[8] ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.
[9] యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!