Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:28

[1] మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం.

[2] అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం.

[3] మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు.

[4] మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం?

[5] యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక.

[6] నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక.

[7] యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా.

[8] నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.

[9] నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.

కీర్తనలు — Chapters