[1] యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.
[2] నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.
[3] నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.
[4] శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. సెలా.
[5] యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి, పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతున్నాయి.
[6] ఆకాశాల్లో యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రుల్లో యెహోవాలాంటి వాడెవడు?
[7] పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.
[8] యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.
[9] ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.
[10] చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును నలిపేశావు. నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టి వేశావు.
[11] ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.
[12] ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.
[13] నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.
[14] నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.
[15] నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.
[16] నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు, నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు.
[17] వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.
[18] మా డాలు యెహోవాది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుడు.
[19] ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను.
[20] నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.
[21] నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.
[22] ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.
[23] అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.
[24] నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.
[25] సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.
[26] నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.
[27] నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.
[28] నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.
[29] అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.
[30] అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,
[31] వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,
[32] నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.
[33] అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.
[34] నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.
[35] అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది
[36] చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.
[37] నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. సెలా.
[38] అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.
[39] నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.
[40] అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.
[41] దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.
[42] అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.
[43] అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.
[44] అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
[45] అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. సెలా.
[46] యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?
[47] నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?
[48] చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? సెలా.
[49] ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?
[50] ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.
[51] యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.
[52] యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగు గాక. ఆమేన్, ఆమేన్.