Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:01

[1] యెహోవా, నువ్వెందుకు దూరంగా నిలిచి ఉంటావు? ఆపద సమయాల్లో నువ్వెందుకు దాగి ఉంటావు?

[2] తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి.

[3] దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు.

[4] దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.

[5] అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు.

[6] నేను ఎన్నడూ ఓడిపోను, తరతరాల వరకూ విరోధాన్ని చూడను, అని అతడు తన మనసులో అనుకుంటాడు.

[7] అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

[8] గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి.

[9] గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు.

[10] అతని బాధితులు నలిగిపోయి దెబ్బలు తింటారు. వాళ్ళు అతని బలమైన వలల్లో పడిపోతారు.

[11] దేవుడు మరచిపోయాడు, ఆయన తన ముఖం కప్పుకున్నాడు, ఆయనకు చూసే ఉద్దేశం లేదు, అని తన హృదయంలో అనుకుంటాడు.

[12] యెహోవా లేచి రా. దేవా, నీ చెయ్యెత్తి తీర్పు తీర్చు. పీడితులను మరిచిపోవద్దు.

[13] నువ్వు నన్ను బాధ్యుణ్ణి చెయ్యవు అని దేవుణ్ణి తృణీకరిస్తూ దుర్మార్గుడు తన హృదయంలో ఎందుకు అనుకుంటున్నాడు?

[14] నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు.

[15] దుష్టల, దురాత్ముల చెయ్యి విరగగొట్టు. నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవనుకుని అతడు చేస్తూ వచ్చిన చెడుపనులకు అతన్నే బాధ్యుణ్ణి చెయ్యి.

[16] ఎన్నటెన్నటికీ యెహోవాయే రాజు. ఆయన తన భూభాగం నుంచి అన్యజాతులను పారదోలుతాడు.

[17] యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్థన వింటావు.

[18] ఏ మనిషీ మళ్ళీ ఎన్నడూ భయభ్రాంతులు కలగజేయకుండా ఉండేలా తండ్రి లేని వాళ్ళను, పీడితులను నువ్వు రక్షిస్తావు.

కీర్తనలు — Chapters