Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:35

[1] యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను.

[2] యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు.

[3] నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను.

[4] మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను.

[5] దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.

[6] నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను.

[7] అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను.

[8] నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం.

[9] పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు.

[10] వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది.

[11] కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు.

[12] చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

కీర్తనలు — Chapters