[1] దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి.
[2] అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక.
[3] నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక.
[4] ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.
[5] సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తరతరాల్లో ప్రజలు నీలో భయభక్తులు చూపుతారు గాక.
[6] కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.
[7] అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక.
[8] సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక.
[9] ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.
[10] తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక.
[11] రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక.
[12] ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.
[13] నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.
[14] బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది.
[15] రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.
[16] దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక.
[17] రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.
[18] ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతులు పొందుతాడు గాక. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు.
[19] ఆయన మహిమగల నామం నిరంతరం స్తుతులు పొందుతుంది గాక. ఈ భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్.
[20] యెష్షయి కొడుకు దావీదు ప్రార్థనలు ముగిశాయి.