[1] సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం!
[2] యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.
[3] సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.
[4] నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. సెలా
[5] ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు.
[6] వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది.
[7] వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.
[8] యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. సెలా.
[9] దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.
[10] నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.
[11] యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.
[12] సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.