Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:31

[1] భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.

[2] ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

[3] యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?

[4] అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.

[5] అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.

[6] ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. సెలా.

[7] మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.

[8] మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.

[9] మహిమగల రాజు లోపలికి వచ్చేలా ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.

[10] మహిమగల ఈ రాజు ఎవరు? దూతల సైన్యాలకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. సెలా.

కీర్తనలు — Chapters