[1] యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది.
[2] షాలేంలో ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది.
[3] అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. సెలా.
[4] నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు.
[5] గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు.
[6] యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.
[7] నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?
[8] నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.
[9] దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. సెలా.
[10] కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు.
[11] మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.
[12] అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.