[1] ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు.
[2] నా పాదాలు కొద్దిలో జారిపోయేవి. నా అడుగులు దాదాపుగా జారి పోయాయి.
[3] భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను.
[4] మరణ సమయంలో కూడా వారికి యాతన అనిపించదు. వారు పుష్టిగా ఉన్నారు.
[5] ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు వచ్చే విపత్తులు వారికి రావు.
[6] కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు.
[7] వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి.
[8] వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు.
[9] వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు.
[10] కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు.
[11] దేవునికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో ఆయనకి అవగాహన ఉందా? అని వారనుకుంటారు.
[12] గమనించండి. వారు దుర్మార్గులు. మరింత డబ్బు సంపాదిస్తూ విచ్చలవిడిగా ఉంటారు.
[13] నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.
[14] రోజంతా నాకు బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఉదయం నేను శిక్షకు గురవుతున్నాను.
[15] ఇలాటి మాటలు నేను చెబుతాను అని నేను అన్నట్టయితే నేను ఈ తరంలోని నీ పిల్లలను మోసం చేసినట్టే.
[16] అయినా దీన్ని గురించి ఆలోచించినప్పుడు అది నాకు చాలా కష్టసాధ్యం అనిపించింది.
[17] నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను.
[18] నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు.
[19] ఒక్క క్షణంలో వారు అంతమైపోతారు. విపరీతమైన భయంతో నశించిపోతారు.
[20] నిద్ర మేలుకుని తన కల మరచిపోయినట్టు ప్రభూ, నువ్వు మేలుకుని వారి ఉనికి లేకుండా చేస్తావు.
[21] నా హృదయంలో దుఃఖం ఉంది. నా అంతరంగంలో నేను గాయపడ్డాను.
[22] అప్పుడు నేను తెలివి తక్కువగా ఆలోచించాను. నీ సన్నిధిలో మృగం వంటి వాడుగా ఉన్నాను.
[23] అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు.
[24] నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు.
[25] పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు.
[26] నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.
[27] నీకు దూరంగా జరిగేవారు నశించిపోతారు. నీకు అపనమ్మకంగా ఉన్నవారందరినీ నువ్వు నాశనం చేస్తావు.
[28] నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.