Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:30

[1] యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు.

[2] యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు.

[3] నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది?

[4] యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు.

[5] మరణంలో ఎవరికీ నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు?

[6] నేను మూలుగుతూ అలసిపోయాను. రాత్రంతా కన్నీటితో నా పరుపు నానిపోతున్నది. నా కన్నీళ్లతో నా పడకను తడిపేస్తున్నాను.

[7] విచారంతో నా కళ్ళు మసకబారాయి. నా ప్రత్యర్థులందరి కారణంగా నా దృష్టి మందగించింది.

[8] పాపం చేసే వాళ్ళంతా నా దగ్గరనుంచి తొలిగి పొండి. ఎందుకంటే యెహోవా నా రోదన ధ్వని విన్నాడు.

[9] కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.

[10] నా శత్రువులందరూ సిగ్గుపడి విపరీతంగా కంగారు పడతారు. వాళ్ళు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి తిరిగిపోతారు.

కీర్తనలు — Chapters