Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:34

[1] యెహోవా, నేను పేదవాణ్ణి. నన్ను అణిచి వేశారు. నా మాట విని నాకు జవాబివ్వు.

[2] నేను నీ విధేయుణ్ణి. నన్ను కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు.

[3] ప్రభూ, రోజంతా నీకు మొరపెడుతున్నాను, నన్ను కనికరించు.

[4] ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.

[5] ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.

[6] యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.

[7] నా కష్టాల్లో నేను నీకు మొరపెడతాను. నువ్వు నాకు జవాబిస్తావు.

[8] ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.

[9] ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.

[10] నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.

[11] యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.

[12] ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.

[13] నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు.

[14] దేవా, గర్విష్ఠులు నా మీదికి ఎగబడ్డారు. దుర్మార్గులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నువ్వంటే వాళ్ళకు లెక్క లేదు.

[15] అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.

[16] నావైపు తిరిగి నన్ను కనికరించు, నీ సేవకుడికి నీ బలం ఇవ్వు. నీ సేవకురాలి కొడుకును కాపాడు.

[17] యెహోవా, నీ ఆదరణ గుర్తు నాకు చూపించు. అప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు అది చూచి సిగ్గుపాలవుతారు. ఎందుకంటే నువ్వు నాకు సాయం చేసి నన్ను ఆదరించావు.

కీర్తనలు — Chapters