Skip to content
Opens in a new window
Listen to this chapter • 9:59

[1] నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి.

[2] నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను.

[3] మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను.

[4] యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం.

[5] రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు.

[6] వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు.

[7] మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.

[8] ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.

[9] ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు.

[10] వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.

[11] ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు.

[12] ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు.

[13] ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు.

[14] పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.

[15] అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.

[16] బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు.

[17] అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు.

[18] వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.

[19] ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?

[20] ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.

[21] యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది.

[22] వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు.

[23] అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు.

[24] ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు.

[25] మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.

[26] ఆకాశంలో తూర్పు గాలి విసిరేలా చేశాడు. తన బలంతో దక్షిణపు గాలి రప్పించాడు.

[27] ధూళి అంత విస్తారంగా మాంసాన్నీ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా పక్షులనూ ఆయన వారి కోసం కురిపించాడు.

[28] అవి వారి శిబిరం మధ్యలో వారి గుడారాల చుట్టూ రాలి పడ్డాయి.

[29] వారు కడుపారా తిన్నారు. వారు దేని కోసం వెంపర్లాడారో దాన్ని ఆయన అనుగ్రహించాడు.

[30] అయితే, వారి ఆశ తీరక ముందే, అంటే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే,

[31] వారి మీద దేవుని కోపం చెలరేగింది. వారిలో బలమైన వారిని ఆయన సంహరించాడు. ఇశ్రాయేలు యువకులు కూలిపోయేలా చేశాడు.

[32] ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు.

[33] కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు.

[34] ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.

[35] దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.

[36] అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు.

[37] ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు.

[38] అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.

[39] ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.

[40] అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.

[41] మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు.

[42] ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ,

[43] ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.

[44] నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు.

[45] ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి.

[46] ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు.

[47] వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు.

[48] వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి.

[49] ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.

[50] తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.

[51] ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు.

[52] ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.

[53] వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు.

[54] తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు.

[55] వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు.

[56] అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు.

[57] తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు.

[58] వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు.

[59] దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు.

[60] షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు.

[61] ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు.

[62] తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు.

[63] అగ్ని వారి యువకులను దహించివేసింది. వారి కన్యలకు పెండ్లిపాటలు లేకుండా పోయాయి.

[64] వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు.

[65] అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.

[66] ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు.

[67] తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు.

[68] యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు.

[69] అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు.

[70] తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు.

[71] పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు.

[72] అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.

కీర్తనలు — Chapters