Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:26

[1] దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.

[2] లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి.

[3] నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి.

[4] ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.

[5] దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు.

[6] దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు.

[7] నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది.

[8] నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను.

[9] నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి.

[10] నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది.

[11] నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు.

[12] నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు.

[13] యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.

[14] ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు.

[15] వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు.

[16] యెహోవా, నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు. అధికమైన నీ కృపను బట్టి నావైపు తిరుగు.

[17] నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.

[18] నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు.

[19] నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.

[20] నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు.

[21] వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.

[22] వారి సంపద వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక.

[23] వారు చూడలేకపోయేలా వారి కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుంది గాక.

[24] వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుంది గాక.

[25] వారి నివాసం నిర్జనం అవుతుంది గాక. వారి గుడారాల్లో ఎవరూ నివాసం ఉండరు గాక.

[26] నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు.

[27] ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు.

[28] జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు.

[29] నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక.

[30] దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.

[31] ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.

[32] దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.

[33] అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.

[34] భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక.

[35] దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది.

[36] ఆయన సేవకుల సంతానం దాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు.

కీర్తనలు — Chapters