[1] యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
[2] యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.
[3] ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
[4] ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.
[5] తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.
[6] ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.
[7] ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి.
[8] అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.
[9] ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.
[10] యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.