[1] ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
[2] లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు.
[3] యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?
[4] వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
[5] యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
[6] వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.
[7] వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
[8] బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
[9] చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?
[10] రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.
[11] మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు.
[12] యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
[13] దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు.
[14] యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
[15] న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
[16] దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
[17] యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
[18] నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
[19] నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
[20] దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
[21] వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు.
[22] అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
[23] ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.