Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:30

[1] దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.

[2] నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.

[3] నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.

[4] నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.

[5] కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.

[6] రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.

[7] నువ్వు నాకు సహాయం చేశావు. నీ రెక్కల నీడలో నేను సంతోషిస్తాను.

[8] నా ప్రాణం నీపై ఆనుకుని ఉంది. నీ కుడిచెయ్యి నాకు ఆధారంగా ఉంది.

[9] నా ప్రాణం తీయాలని వెతుకుతున్నవారు భూమి అడుగు భాగాలకు దిగిపోతారు.

[10] వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.

[11] అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.

కీర్తనలు — Chapters