Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:57

[1] యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది.

[2] యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే.

[3] గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.

[4] ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.

[5] మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.

[6] యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.

[7] కృతజ్ఞతా స్తుతులతో యెహోవాను కీర్తించండి. తంతి వాయిద్యంతో మన దేవునికి స్తుతి గీతాలు పాడండి.

[8] ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.

[9] పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.

[10] గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు.

[11] తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం.

[12] యెరూషలేమా, యెహోవాను ఘనపరచు. సీయోనూ, నీ దేవుణ్ణి కీర్తించు.

[13] ఆయన నీ ద్వారబంధాల గడులు దిట్టం చేశాడు. మీ నివాసాల మధ్య మీ పిల్లలను ఆశీర్వదించాడు.

[14] నీ పొలిమేరల్లో శాంతి సమాధానాలు నిలిచి ఉండేలా చేసేది ఆయనే. నీకు ఆహారంగా మంచి గోదుమ పంటను ఇచ్చి నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే.

[15] భూమికి ఆజ్ఞ జారీ చేసేవాడు ఆయనే. ఆయన వాక్కు భూమిపై చాలా వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది.

[16] గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.

[17] వడగళ్ళు ముక్కలు ముక్కలుగా నేలపై విసిరేది ఆయనే. ఆయన చలి పుట్టించినప్పుడు ఎవరు తట్టుకోగలరు?

[18] ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ కరిగిపోతాయి. ఆయన తన గాలి వీచేలా చేస్తే నీళ్లు ప్రవహిస్తాయి.

[19] తన వాక్కును యాకోబుకు తెలియజేశాడు. తన నియమనిబంధనలు, న్యాయ నిర్ణయాలు ఇశ్రాయేలుకు తెలియజేశాడు.

[20] మరి ఏ జనాంగం విషయంలోనూ ఆయన ఇలా చెయ్య లేదు. అయినా ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు గ్రహించలేదు. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు — Chapters