Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:24

[1] యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.

[2] యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,

[3] తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.

[4] వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.

[5] ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది.

[6] వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.

[7] వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.

[8] ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

[9] ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

[10] చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు.

[11] దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.

[12] కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.

[13] కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు

[14] వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు.

[15] ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

[16] ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు.

[17] బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.

[18] భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.

[19] కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.

[20] ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.

[21] ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

[22] వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.

[23] ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు

[24] యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.

[25] ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.

[26] వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి ప్రాణం కరిగిపోయింది.

[27] మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.

[28] బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.

[29] ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.

[30] అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.

[31] ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

[32] జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.

[33] ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను,

[34] దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.

[35] అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు.

[36] వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి,

[37] వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.

[38] ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు.

[39] వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,

[40] శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు.

[41] అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు.

[42] యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు.

[43] బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక.

కీర్తనలు — Chapters