[1] యెహోవా, నువ్వు నీ దేశాన్ని దయ చూశావు, యాకోబు వంశస్తుల క్షేమాన్ని తిరిగి ఇచ్చావు.
[2] నీ ప్రజల పాపాలు క్షమించావు, వారి పాపాలన్నీ కప్పివేశావు. సెలా.
[3] నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు.
[4] మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని ఉద్ధరించు. మా మీద నీ కోపం చాలించు.
[5] మా మీద కలకాలం కోపంగా ఉంటావా? తరతరాలుగా నీ కోపం సాగిస్తావా?
[6] నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?
[7] యెహోవా, నీ కృప మాకు చూపించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు.
[8] యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు.
[9] ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది.
[10] నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.
[11] భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది.
[12] యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది.
[13] నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.