[1] సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
[2] అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
[3] నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
[4] ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
[5] నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
[6] వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
[7] వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
[8] ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
[9] ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
[10] వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
[11] వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
[12] కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
[13] ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.
[14] వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది.
[15] అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు.
[16] ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.
[17] ఎందుకంటే వాడు చనిపోయేటప్పుడు దేన్నీ తీసుకువెళ్ళడు. వాడి ప్రభావం వాడి వెంట దిగిపోదు.
[18] మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
[19] అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు.
[20] ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు.