[1] యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.
[2] యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?
[3] న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.
[4] యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ,
[5] నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు.
[6] మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.
[7] ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు.
[8] అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు.
[9] ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు.
[10] పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు.
[11] నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు.
[12] అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు.
[13] అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు.
[14] అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు.
[15] వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు.
[16] వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు.
[17] భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.
[18] వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.
[19] హోరేబులో వారు దూడను చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహానికి మొక్కారు.
[20] తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు.
[21] ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను
[22] ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు.
[23] అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.
[24] రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు.
[25] యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు.
[26] అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి,
[27] అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి, దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు.
[28] వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు.
[29] వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది.
[30] ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది.
[31] నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది.
[32] మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది.
[33] ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు.
[34] యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు.
[35] అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.
[36] వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.
[37] వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.
[38] నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.
[39] తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.
[40] కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.
[41] ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పగవారు వారిని ఏలారు.
[42] శత్రువులు వారిని బాధపెట్టారు. వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు.
[43] అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ పాపం మూలంగా హీనదశకు వెళ్ళిపోయారు.
[44] అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.
[45] వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు.
[46] వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.
[47] యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.
[48] ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించండి.