Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:43

[1] దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.

[2] పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.

[3] నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.

[4] దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.

[5] తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.

[6] దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.

[7] దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు

[8] దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.

[9] దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.

[10] నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.

[11] ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.

[12] సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.

[13] గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?

[14] సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.

[15] బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.

[16] శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.

[17] దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.

[18] నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.

[19] ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.

[20] మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.

[21] దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.

[22] ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.

[23] నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.

[24] దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.

[25] చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.

[26] సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.

[27] మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.

[28] నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.

[29] యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.

[30] జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.

[31] ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది.

[32] భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి.

[33] అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం.

[34] దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది.

[35] దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.

కీర్తనలు — Chapters