Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:05

[1] యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.

[2] ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.

[3] మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది.

[4] అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.

[5] యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

[6] యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.

[7] నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.

[8] మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.

[9] సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.

[10] నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి.

[11] నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.

[12] యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను?

[13] రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను.

[14] యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.

[15] యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.

[16] యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు.

[17] నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను

[18] ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.

[19] యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు — Chapters