Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:28

[1] నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు.

[2] దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు.

[3] నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు

[4] నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను.

[5] నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు.

[6] ఇలాటి శత్రుమూకపై దుర్మార్గుడొకణ్ణి అధికారిగా నియమించు. నేరాలు మోపేవాడు వారి కుడివైపున నిలబడతాడు గాక.

[7] వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చు గాక. వాడి ప్రార్థన పాపంగా ఎంచబడు గాక

[8] వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక.

[9] వాడి బిడ్డలు తండ్రిలేని వారౌతారు గాక. వాడి భార్య వితంతువు అగు గాక

[10] వాడి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తు గాక. శిథిలమైపోయిన తమ ఇళ్ళకు దూరంగా సాయం కోసం అర్థిస్తారు గాక.

[11] వాడి ఆస్తి అంతా అప్పులవాళ్ళు ఆక్రమించుకుంటారు గాక. వాడు సంపాదించినది పరులు దోచుకుంటారు గాక.

[12] వాడిపై జాలిపడే వారు ఎవరూ లేకపోదురు గాక. వాడి అనాథ పిల్లల పై దయ చూపేవారు ఉండక పోదురు గాక.

[13] వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక.

[14] వాడి పితరుల దోషం యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక. వాడి తల్లి చేసిన పాపం మరుపుకు రాకుండు గాక.

[15] యెహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపై నుండి కొట్టి వేస్తాడు గాక. వారి దోషం నిత్యం యెహోవా సన్నిధిని కనబడు గాక.

[16] ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు.

[17] శపించడం వాడికి మహా ఇష్టం. కాబట్టి అది వాడి మీదికే రావాలి. దీవెనను వాడు అసహ్యించుకున్నాడు. కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు.

[18] ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది.

[19] కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక.

[20] నాపై నేరం మోపేవారికి, నా గురించి చెడుగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలిగే ప్రతీకారం అవుతుంది గాక.

[21] యెహోవా ప్రభూ, నీ నామాన్నిబట్టి నా పట్ల దయ చూపు. నీ నిబంధన విశ్వసనీయత ఉదాత్తమైనది గనక నన్ను రక్షించు.

[22] నేను పీడితుణ్ణి. అవసరంలో ఉన్నాను. నా హృదయం నాలో గాయపడి ఉంది.

[23] సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను. మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు.

[24] ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది.

[25] నాపై నిందలు మోపే వారు నన్ను పిచ్చివాడన్నట్టు చూస్తున్నారు. వారు నన్ను చూసి తలాడిస్తున్నారు.

[26] యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు.

[27] ఇది నీ వల్లనే జరిగిందనీ, యెహోవావైన నీవే దీన్ని చేశావనీ వారికి తెలియాలి.

[28] వారు నన్ను శపిస్తున్నారు గానీ దయచేసి నీవు నన్ను దీవించు. వారు నాపై దాడి చేస్తే వారికే అవమానం కలగాలి. నీ సేవకుడు మాత్రం సంతోషించాలి.

[29] నా విరోధులు అవమానం ధరించుకుంటారు గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక.

[30] సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను.

[31] ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు.

కీర్తనలు — Chapters