[1] బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!
[2] యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.
[3] యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు.
[4] యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.
[5] యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.
[6] ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు.
[7] యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది.
[8] యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు.
[9] యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు.
[10] యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు.
[11] యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు.