Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:34

[1] యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు.

[2] నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను.

[3] రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు.

[4] వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి.

[5] యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.

[6] ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.

[7] దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.

[8] యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.

[9] ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

[10] యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, ఆయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు — Chapters