Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:13

[1] సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.

[2] ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.

[3] వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.

[4] ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.

[5] రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు.

[6] చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు.

[7] నీ పక్కన వేయి మంది, నీ కుడిపక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు.

[8] దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు.

[9] యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.

[10] ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.

[11] నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.

[12] నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.

[13] నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.

[14] అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను.

[15] అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.

[16] దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను.

కీర్తనలు — Chapters