[1] యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.
[2] ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
[3] ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.
[4] యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.
[5] ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
[6] ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
[7] ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి.
[8] తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,
[9] ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
[10] వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,
[11] కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.
[12] ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు.
[13] వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా
[14] వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు.
[15] నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.
[16] దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు.
[17] వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు.
[18] వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది.
[19] అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు.
[20] రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.
[21] ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి,
[22] తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు.
[23] ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు.
[24] ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు.
[25] తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు.
[26] ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు.
[27] వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు.
[28] ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.
[29] ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు.
[30] వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి.
[31] ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి.
[32] ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు.
[33] వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు.
[34] ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,
[35] అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి.
[36] వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు.
[37] అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు.
[38] వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు.
[39] వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు.
[40] వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు.
[41] శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి.
[42] ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,
[43] తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.
[44] అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు.
[45] వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి.