[1] యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[2] ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[3] ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[4] గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగేది ఆయన ఒక్కడే. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[5] ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[6] ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[7] ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[8] పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[9] రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[10] ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[11] ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[12] ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[13] ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[14] ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[15] ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[16] ఎడారి మార్గం గుండా ఆయన తన ప్రజలను నడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[17] గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[18] ఘనత వహించిన రాజులను ఆయన హతం చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[19] అమోరీయుల రాజైన సీహోనును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[20] బాషాను రాజైన ఓగును ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[21] వాళ్ళ దేశాన్ని మనకు వారసత్వ సంపదగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[22] తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సొత్తుగా అప్పగించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[23] మనం దీనావస్థలో పడి ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆదరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[24] మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[25] సమస్త జీవరాశులకు ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
[26] పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.