[1] నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
[2] నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.
[3] ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.
[4] నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.
[5] నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
[6] యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.
[7] ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.
[8] యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
[9] ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.
[10] మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
[11] భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
[12] పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
[13] తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
[14] మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
[15] మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.
[16] దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
[17] యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.
[18] వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.
[19] యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.
[20] యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.
[21] యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.
[22] యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.