[1] దేవా, నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు మేపే గొర్రెల మీద ఎందుకు కోపగించుకుంటున్నావు?
[2] నీ వారసత్వంగా కొనుక్కున్న గోత్రాన్ని, నువ్వు అనాది కాలంలో విమోచించిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ నివాసమైన ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో.
[3] నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.
[4] నీ ప్రత్యక్ష గుడారంలో నీ శత్రువులు గర్జిస్తున్నారు. వారి విజయధ్వజాలను ఎత్తి నిలబెట్టారు.
[5] దట్టమైన గుబురు చెట్ల మీద గొడ్డళ్ళు ఎత్తినట్టు అది కనిపిస్తున్నది.
[6] వారు గొడ్డళ్ళు, సుత్తెలు తీసుకుని దాని నగిషీ చెక్కడాలను పూర్తిగా విరగగొట్టారు.
[7] నీ పరిశుద్ధ స్థలానికి మంట పెట్టారు. నీ నివాసమైన మందిరాన్ని నేలమట్టం చేసి అపవిత్రపరిచారు.
[8] వాటినన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేద్దాం అనుకుంటూ వారు దేశంలోని నీ సమావేశ మందిరాలన్నిటినీ కాల్చివేశారు.
[9] దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
[10] దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?
[11] నీ హస్తాన్ని, నీ కుడి చేతిని ఎందుకు ముడుచుకుని ఉన్నావు? నీ వస్త్రంలో నుండి దాన్ని తీసి వారిని నాశనం చెయ్యి.
[12] పురాతన కాలం నుండీ దేవుడు నా రాజుగా ఈ భూమిపై రక్షణ కలిగిస్తూ ఉన్నాడు.
[13] నీ బలంతో సముద్రాన్ని పాయలుగా చేశావు. నీటిలోని బ్రహ్మాండమైన సముద్ర వికృత జీవుల తలలు చితకగొట్టావు.
[14] సముద్ర రాక్షసి తలలను నువ్వు ముక్కలు చేశావు. అరణ్యాల్లో నివసించే వారికి దాన్ని ఆహారంగా ఇచ్చావు.
[15] నీటి ఊటలను, ప్రవాహాలను పుట్టించావు. నిత్యం పారే నదులను ఎండిపోజేశావు.
[16] పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నువ్వే వాటి స్థానాల్లో ఉంచావు.
[17] భూమికి సరిహద్దులు నియమించింది నువ్వే. వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు.
[18] యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.
[19] నీ పావురం ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగింపకు. బాధలు పొందే నీ ప్రజలను ఎన్నడూ మరువకు.
[20] నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.
[21] పీడితుణ్ణి అవమానంతో మరలనియ్యకు. బాధలు పొందినవారు, దరిద్రులు నీ నామాన్ని స్తుతిస్తారు గాక.
[22] దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.
[23] నీ శత్రువుల స్వరాన్ని, నిన్ను ఎడతెగక ఎదిరించేవారి గర్జింపులను మరచిపోవద్దు.