Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:08

[1] నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది.

[2] మనుషులందరి కంటే నువ్వు అందంగా ఉన్నావు. దయా కనికరాలు నీ పెదాలపై పోశారు. కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదించాడని మాకు తెలుస్తూ ఉంది.

[3] బలశాలీ, నీ నడుముకు కత్తిని ధరించు. నీ తేజస్సునూ నీ ప్రభావాన్నీ ధరించుకో.

[4] నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా నీ రాజసంతో వాహనంపై విజయోత్సవంతో బయల్దేరు. నీ కుడిచెయ్యి భయాన్ని పుట్టించే సంగతులను నీకు నేర్పుతుంది.

[5] నీ బాణాలు పదునైనవి. నీ ఎదుట ప్రజలు కూలిపోతారు. రాజు శత్రువు గుండెల్లో నీ బాణాలు గుచ్చుకుని ఉంటాయి.

[6] దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం.

[7] నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.

[8] నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి.

[9] గౌరవనీయులైన నీ స్త్రీలలో రాజ కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు స్వర్ణాభరణాలు ధరించుకుని రాణి నీ కుడి వైపున నిలబడి ఉంది.

[10] కుమారీ, విను, ధ్యాస పెట్టి ఆలకించు. నీ తండ్రి కుటుంబాన్నీ, నీ సొంతవాళ్ళనీ మర్చిపో.

[11] ఈ విధంగా రాజు నీ సౌందర్యాన్ని ఆశిస్తాడు. ఆయన నీ ప్రభువు. ఆయన్ని పూజ్యభావంతో గౌరవించు.

[12] తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు.

[13] అంతఃపురంలో ఉన్న రాజకుమారి వైభవంగా ఉంది. ఆమె దుస్తులు బంగారంతో నేసినవి.

[14] వివిధ రంగులతో అల్లిక చేసిన దుస్తులు వేసుకున్న ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తున్నారు. ఆమె వెంట ఆమెను అనుసరించే ఆమె చెలికత్తెలైన కన్యలను నీ దగ్గరకు తీసుకువస్తున్నారు.

[15] ఆనందోత్సాహలతో వాళ్ళను తీసుకువస్తున్నారు. వాళ్ళంతా రాజ భవనంలో ప్రవేశిస్తున్నారు.

[16] నీ పితరులకు బదులుగా నీ పిల్లలుంటారు. వాళ్ళను నువ్వు భూమి అంతట్లో అధిపతులుగా నియమిస్తావు.

[17] అన్ని తరాల్లోనూ నీ నామం జ్ఞాపకం ఉండేలా నేను చేస్తాను. కాబట్టి ప్రజలు అన్ని తరాల్లో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

కీర్తనలు — Chapters