[1] ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!
[2] రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.
[3] వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.
[4] అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.
[5] సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.
[6] ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
[7] యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
[8] యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.
[9] యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.
[10] అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
[11] వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
[12] తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.
[13] దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.
[14] యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.