[1] మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.
[2] అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.
[3] దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు.
[4] చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.
[5] వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
[6] వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది.
[7] తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
[8] సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.
[9] దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.
[10] దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.
[11] న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ.
[12] సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు.
[13] తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు.
[14] ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.