Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:30

[1] యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.

[2] ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక.

[3] ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక.

[4] ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.

[5] ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.

[6] యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?

[7] యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.

[8] మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.

[9] రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.

[10] అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

[11] నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

[12] కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

[13] వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు.

[14] యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం.

[15] నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది.

[16] యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది.

[17] నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను.

[18] యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు.

[19] నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను.

[20] ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు.

[21] నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.

[22] ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.

[23] ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం.

[24] ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.

[25] యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.

[26] యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.

[27] యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.

[28] నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.

[29] యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.

కీర్తనలు — Chapters