[1] మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నిబంధన విశ్వాస్యత, అధారపడ దగిన నీ గుణాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగు గాక.
[2] వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు?
[3] మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు
[4] వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు.
[5] వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు.
[6] చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు.
[7] చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు.
[8] వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే.
[9] ఇశ్రాయేలీయులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి కవచం.
[10] అహరోను వంశస్థులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారి కవచం.
[11] యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు.
[12] యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు.
[13] పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు.
[14] యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు.
[15] భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు.
[16] ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.
[17] మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు.
[18] మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి.