[1] సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.
[2] ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.
[3] నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.
[4] లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.
[5] దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి. మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు.
[6] ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు. ప్రజలు కాలినడకన నదిని దాటారు. అక్కడ ఆయనలో మేము సంతోషించాము.
[7] ఆయన తన పరాక్రమంతో శాశ్వతంగా ఏలుతాడు. ఆయన కళ్ళు అన్యజాతులను పరిశీలిస్తాయి. తిరుగుబాటుచేసే ప్రజలు తమలో తాము గర్వించవద్దు.
[8] జనాల్లారా, మా దేవుణ్ణి సన్నుతించండి. స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి.
[9] మా ప్రాణాలను జీవంతో నింపేది ఆయనే. ఆయన మా నడకలు స్థిరంగా ఉంచుతాడు.
[10] దేవా, నువ్వు మమ్మల్ని పరీక్షించావు. వెండిని పరీక్షించి నిర్మలం చేసినట్టు మమ్మల్ని పరీక్షకు గురిచేశావు.
[11] మమ్మల్ని ఒక వలలో ఇరుక్కునేలా చేశావు. మా నడుముల మీద పెద్ద బరువు పెట్టావు.
[12] మనుషులు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. మేము నిప్పులగుండా నీళ్ళ గుండా నడిచి వెళ్ళాం. అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు.
[13] దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను.
[14] నేను బాధల్లో ఉన్నప్పుడు నా పెదాలు, నా నోరు ప్రమాణం చేసిన మొక్కుబడులు నేను నీకు అర్పిస్తాను.
[15] పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను. ఎద్దులను, పోతుమేకలను అర్పిస్తాను.
[16] దేవునిలో భయభక్తులు గలవారంతా వచ్చి వినండి, ఆయన నా కోసం చేసిన కార్యాలు నేను వినిపిస్తాను.
[17] ఆయనకు నేను మొరపెట్టాను. అప్పుడే నా నాలుక ఆయన్ని కీర్తించింది.
[18] నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు.
[19] కానీ దేవుడు నా మనవి అంగీకరించాడు. ఆయన నా విన్నపాన్ని ఆలకించాడు.
[20] దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు, నా నుండి తన కృపను తీసివేయలేదు. ఆయనకు స్తుతి కలుగు గాక.